Pages

Thursday 12 April 2012

నోకియాకు చుక్కలు చూపిస్తున్న గూగుల్, ఏపిల్


మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఏళ్ళతరబడి రారాజుగా చెలామణీ అయిన నోకియా మార్కెట్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు శ్యాంసంగ్, సోని ఎరిక్సన్ కంపెనీలు విపరీతంగా పుంజుకున్నాయి. ఈ పరిణామానికి కారణం స్వయంకృతాపరాధమని తెలుసుకున్న నోకియా పూర్వ ప్రాభవాన్ని సంతరించుకోవడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

సెల్ ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయిలో ఆ కంపెనీ ప్రస్థానం ప్రారంభమయింది. ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే రెండేళ్ళుగా ఆ కంపెనీ అమ్మకాలు తిరోగమనదిశలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గూగుల్ కంపెనీ సెల్ ఫోన్లకోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మొబైల్ ఫోన్ల ఉపయోగంలో ఎన్నో సానుకూల, విప్లవాత్మక మార్పులు రావడంతో అందరూ దానిపట్ల ఆకర్షితులయ్యారు. దీనిని గమనించిన శ్యాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పలు మోడల్స్‌ను మార్కెట్లోకి దించింది. సోని ఎరిక్సన్, మోటరోలా తదితర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. కానీ మార్కెట్ నంబర్ వన్‌గాఉన్న నోకియామాత్రం ఈ పరిణామాన్ని లైట్ తీసుకుంది. ఏళ్ళతరబడి తమ ఫోన్లలో అమర్చుతున్న సింబియన్ ఓఎస్‌నే కొనసాగించింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న యూజబిలిటీ సింబియన్‌లో లేకపోవడంతో నోకియాకు ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. విండోస్, అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కొన్ని మోడళ్ళను విడుదల చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

అటు, ఏపిల్ కంపెనీ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ iosతో ఐఫోన్లను మార్కెట్లోకి దించడం కూడా నోకియాకు తీవ్ర విఘాతంగా మారింది. నోకియా హైఎండ్ ఫోన్లు, ఏపిల్ ఐఫోన్లకు ఏమాత్రం సరితూగలేకపోయాయి. ఐఫోన్లలోని ఫీచ‌ర్స్‌ వాడకందార్లకు విపరీతంగా నచ్చుతుండటంతో ఆ ఫోన్లకోసం జనం, ముఖ్యంగా యువత వేలంవెర్రిగా ఎగబడుతున్నారు. నోకియా హైఎండ్ మోడళ్ళలో నాలుగేళ్ళక్రితం వచ్చిన N95 తప్పితే, తర్వాత వచ్చిన ఏ ఒక్కటీ ప్రజాదరణకు నోచుకోలేకపోయింది.

గూగుల్, ఏపిల్ కంపెనీల ఉత్పత్తులను ఎదుర్కోవడంకోసం నోకియా తాజా వ్యూహాలతో, కొత్తకొత్త ఫీచర్లతో, విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇటీవలే ల్యూమియా 800అనే మోడల్ దించింది. ఇది ఎంతవరకు ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

మరోవైపు డ్యూవల్ సిమ్ మార్కెట్ పట్ల నిర్లక్ష్యం వహించడంకూడా నోకియా అమ్మకాలను దెబ్బతీసింది. అటు శ్యాంసంగ్ కంపెనీమాత్రం డ్యువల్ సిమ్ మోడళ్ళను పెద్దసంఖ్యలో విడుదల చేసి మార్కెట్‌ను చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నోకియా, ఇప్పుడు డ్యువల్ సిమ్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున మోడళ్ళను దించుతోంది.

స్థానిక, చైనా కంపెనీల ప్రభావంకూడా నోకియాపై తీవ్రంగా ఉంది. మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి స్థానిక కంపెనీలు, చైనావారి నకిలీ ఉత్పత్తులు నోకియా అమ్మకాలను బాగా దెబ్బతీశాయి. మైక్రోమ్యాక్స్ వంటి స్థానిక కంపెనీలు కూడా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మోడళ్ళను దించి మార్కెట్టును ఎంతోకొంత చేజిక్కించున్నాయి.

బిజినెస్ ఫోన్ల క్యాటగరీలో అగ్రగామిగా చెలామణీ అయిన బ్లాక్‌బెర్రీ కంపెనీకూడా నోకియాలానే తిరోగమన దిశలో ఉండటం మొబైల్ ఫోన్ల మార్కెట్లో మరో విశేషం. పరిస్థితిని పునరుద్ధరించడంకోసం ఆ కంపెనీకూడా చర్యలు చేపట్టింది ఇటీవల తన ఫోన్ల ధరలను రెండు విడతలుగా తగ్గించింది.

Thursday 2 February 2012

"కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"


పీసీసీ నాయకత్వం కాపుకు, మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు, కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో రాజ్యమేలుతున్న కులరాజకీయాల ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‍లో కూడా అమలుచేసే ప్రణాళికలో భాగమే కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఈ కొత్త ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కమ్మయువత, ప్రజారాజ్యం పెట్టినపుడు కాపుయువత ఆవేశంతో ఎలా ఊగిపోయారో, ఇప్పుడు వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల రెడ్డి యువత కూడా అంతే ఆవేశంగా ఉన్నారన్న విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తెలిసింది. దానికితోడు వైఎస్ చనిపోయినపుడు ఆయన అంతిమసంస్కారాలు మొత్తం క్రైస్తవ పద్ధతిలో జరగడం, వైఎస్ కుటుంబసభ్యులు అందరూ చర్చిలలో బైబిల్ పట్టుకుని ప్రార్ధనలు చేయడం అంతా ఛానల్సులో ప్రత్యక్షంగా చూసిన క్రిస్టియన్ వర్గం కూడా జగన్ మోహన రెడ్డివైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హైకమాండ్‍కు కబురందింది. తమ సంప్రదాయఓటుబ్యాంకులో సింహభాగంగా ఉండే వర్గాలు దూరమైపోతున్నందున దీనిని పూడ్చుకోవడంకోసం సోనియా బృందానికి చిరంజీవిమీద(ఆయన వెనక ఉన్న అతిపెద్ద సామాజికవర్గంపైన) అకస్మాత్తుగా ప్రేమ అంకురించింది. రాష్ట్రంలో సంఖ్యాపరంగా రెడ్లతో సమానంగానో, వారికంటే ఎక్కువగానో(బలిజ, ఒంటరి, మున్నూరుకాపులతో కలుపుకుంటే) ఉండే కాపులకు మంచిస్థానం కల్పించడంద్వారా ఆ వర్గంవారిని ఆకర్షించాలని చూస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కాపుల ప్రయోజనాలను కాపుకాచేది తామేననిపించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం.

అయితే ఈ పరిణామాలపై కాపువర్గం మాత్రం సంతృప్తిగాలేదు. ఈ పదవుల పందేరం తమకు, మిగిలిన వర్గాలకు మధ్య విబేధాలు రగిలించేవిధంగా ఉందని కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని, సంఖ్యాపరంగా రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన తమ కులంపై - కాంగ్రెస్ పార్టీకి కొత్తరాజకీయ సమీకరణాలరీత్యా ప్రేమ అంకురించి రెండు, మూడు పదవులు ఇచ్చినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్లు కాదని కాపువర్గం నాయకులు అంటున్నారు. పైగా ఈ రెండు, మూడు పదవుల వలన తమ వర్గం బావుకున్నదేమీ లేకపోయినా మీడియాలో రచ్చ జరుగుతోందని, బీసీలు, తదితర కులాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులకు ఇప్పుడు ఇచ్చిన పదవుల్లో బీసీలు కూడా ఉన్నారని వారు గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనుకబడినవర్గానికి చెందిన తూర్పుకాపు కులంవారని, కొత్తమంత్రి రామచంద్రయ్య కూడా బీసీ వర్గానికి చెందిన బలిజకులస్తుడని, ఇక విజయనిర్మల అసలు కాపే కాదని తెలిపారు. ఆమె కేరళరాష్ట్రంనుంచి వలసవచ్చి స్థిరపడ్డవారని వివరించారు. చిరంజీవి అనుభవరాహిత్యంవలన, కాపులను సంఘటితపరిచే సరైన నాయకత్వం, కులవేదిక లేకపోవడం వలన సమాజంలో పలచనబడిపోతున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ కాపుసంఘాల నాయకులు, కులాన్ని డబ్బుచేసుకోవడం, ప్రభుత్వంలో పైరవీలు చేసుకోవడం, నాయకత్వలక్షణాలు లేక సంకుచిత ధోరణితో లోలోపల కొట్టుకోవడంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారని వాపోతున్నారు. చాకలి, మంగలి, మాదిగ వంటి కులవృత్తులవారుకూడా, తమ కులాన్ని గురించి ఎవరైనా మాటవరసకు తక్కువగా ప్రస్తావించినా క్షమాపణ చెప్పేదాకా ఊరుకోకపోతుండగా, కాపులను ఎవరు ఎన్ని తిట్టినా ఖండించే దిక్కులేదంటున్నారు. ఇటీవల బాలకృష్ణ వివిధ సభలలో చిరంజీవిని ప్రస్తావిస్తూ, వాడు, వీడు అంటూ హేయంగా మాట్లాడితే, రాష్ట్రస్థాయిలో ఖండించే కాపు నాయకడు ఒక్కడు కూడా లేకపోవడాన్ని నాయకత్వలేమికి ఉదాహరణగా వారు చూపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించి కాపుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమయింది. సామాజిక న్యాయం అనే నినాదంతో చిరంజీవి 'ప్రజారాజ్యం'పార్టీని పెట్టినపుడు కాపులతోబాటు, వెనకబడినవర్గాలు కూడా ఆసక్తి చూపాయి. అయితే, ధృడసంకల్పం లేకుండా, బెరుకు బెరుకుగా పార్టీని పెట్టిన చిరంజీవి మొదట్లో ఉవ్వెత్తునవచ్చిన అద్భుత ప్రజాదరణను నిలుపుకోలేకపోయారు. నిజాయతీగా బ్లడ్ బ్యాంకును నడుపుతున్నప్పటికీ వ్యతిరేకపార్టీలు దానిమీద నిందారోపణలు చేస్తే తిప్పికొట్టే నాధుడు ప్రజారాజ్యంలో ఒక్కడూ లేకపోయారు. ఆ తర్వాత వైరివర్గాలు ఇంకా రెచ్చిపోయి ఆ పార్టీని కాపుపార్టీగా ముద్రవేసేసి, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేశాయి. దాంతో మెల్లమెల్లగా బడుగు, బలహీనవర్గాలు ప్రజారాజ్యానికి దూరమయ్యాయి. కాపులు కూడా ప్రజారాజ్యానికి గంపగుత్తగా ఏమీ ఓట్లేయలేదు. గోదావరిజిల్లాలో కాపులు నిర్ణయాత్మకంగా ఉండేచోట్లకూడా ప్రజారాజ్యం ఓడిపోవడమే దీనికి నిదర్శనం. అమాయకంగా, అనుమానంగా చిరంజీవి, అతితెలివితో ఆయన బావమరిది అల్లుఅరవింద్ చేసిన పనులవలన ఆ పార్టీ, ఎన్నికలనాటికి దిగజారిపోయి అతికొద్ది అసెంబ్లీస్థానాలకే పరిమితమైపోయింది. ప్రజారాజ్యం పెట్టిన తొలినాళ్ళలో అపూర్వరీతిలో సంఘటితమైన కాపులు, ఇప్పుడు అదేస్థాయిలో తమ హస్తంతో చేయి కలుపుతారని కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తున్నారు. కమ్మలు తెలుగుదేశాన్ని, రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావించినట్లుగానే(వాస్తవానికి రెడ్లు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రెండింటిలోనూ గణనీయమైన పదవులే పొందినప్పటికీ, కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తమ సొంతపార్టీగా భావిస్తుండటం విశేషం), కాపులు కాంగ్రెస్ పార్టీని తమదిగా భావించాలని(ఓన్ చేసుకోవాలని) వారి ఆకాంక్ష. మరి అది నేరవేరుతుందో, లేదో వేచి చూడాలి.

Friday 19 August 2011

ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?




అన్నాహజారే ఎపిసోడ్ – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, అన్నా వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. అన్నావిషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం.

రెండు తప్పుడు నిర్ణయాలతో - డిసెంబర్ 9నాటి తెలంగాణా ప్రకటన, జగన్‌ను సరిగా టేకిల్ చేయలేకపోవడం(జగన్‌ బయటకు వెళ్ళడంవలన కాంగ్రెస్‌కు భారీ నష్టమే జరిగింది) - ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రావణకాష్ఠంలాగా మార్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని మించిన ఒక చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడి నడిబజారులో పరువు పోగొట్టుకుంది. నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్న అన్నాను, నియంతృత్వ ధోరణిలో కొద్దిగంటలముందు అరెస్టు చేయించింది. ఒక్కసారి దేశమంతా భగ్గుమంది. ప్రజలు వెల్లవలా బయటకొచ్చి అన్నాకు మద్దతుగా నిలబడి ప్రభుత్వంపై నిప్పులుగక్కారు. అప్పటికిగానీ పరిస్థితి అర్ధంగానీ ప్రభుత్వం కాళ్ళబేరానికొచ్చింది. అన్నా బృందంతో బేరసారాలు మొదలుపెట్టి చివరికి వారు కోరినట్లు రామ్ లీలా మైదానంలో దీక్షకు అనుమతి ఇచ్చింది.

సరే, డిసెంబర్9నాటి చిదంబరం ప్రకటనను – కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో హడావుడిగా తీసుకున్న నిర్ణయమని, జగన్ విషయంలో - తెలంగాణా సీనియర్లు హైక‌మాండ్‌ను తప్పుదోవ పట్టించడం కారణమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, అన్నా- లోక్‌పాల్ సంక్షోభం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమి కాదు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును తూతూమంత్రంగా రూపొందిస్తోందని ఆరోపిస్తూ, ఆగస్టు 16నుంచి మళ్ళీ నిరాహారదీక్ష చేపడతానని అన్నా దాదాపు 15రోజులక్రితమే ప్రకటించారు. మరి ఇంత సమయమున్నా ప్రభుత్వం ఈ విషయంలో ఇటువంటి అవివేకమైన నిర్ణయం ఎలా తీసుకుందో తెలియడంలేదు. ఏప్రిల్‌నెల‌లో అన్నా చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ప్రజలనుంచి, మీడియానుంచి... ఇంకా చెప్పాలంటే సమాజంలోని అన్నివర్గాలనుంచి లభించిన అనూహ్య మద్దతు, ఆ దెబ్బకు దడిసి తామే దిగివచ్చి అన్నా పెట్టిన షరతులన్నింటికీ అంగీకరించడం – కేంద్రప్రభుత్వం మరిచిపోయిఉంటుందని అనుకోలేము. మరి, ఇంత జరిగినా చివరి నిమిషంలో ప్రభుత్వం నిన్న ఇటువంటి అవివేకమైన నిర్ణయం తీసుకుందంటే 1. ప్రజల మనోభావాలను పసిగట్టలేకపోవడమైనా జరిగిఉండాలి లేదా 2. సరైనరీతిలో మేధోమథనం జరగకపోయిఉండాలి. మొదటి కారణాన్ని కొట్టిపారేయవచ్చు...ఎందుకంటే ప్రజల మనోభావాలను పసిగట్టి ఎప్పటికప్పుడు చేరవేసే పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇక రెండో కారణమే అయి ఉండాలి. మరి ఇంతమంది కురువృద్ధులు, దిగ్గజాలు ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే వారిమధ్యలో పొంతన లేకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. కేంద్రమంత్రులు తలోదారిగా ఉండి కీచులాడుకోవడం, ప్రధానమంత్రి వారిని అదుపు చేయలేకపోవడం గురించి మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామం ఆ వార్తలను ధృవీకరించినట్లయింది. మరి ఈ ప్రభుత్వం ముందుముందు ఇంకా ఇలాంటి చెత్త నిర్ణయాలు ఎన్ని తీసుకుంటుందో చూడాలి.

Sunday 22 May 2011

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల




ఆర్టిస్టుగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్పనటుడని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ - గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశంగర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని(పాండవ వనవాసంలో "బానిసలు" డైలాగ్ తరహాలోనా...?) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్నిసార్లు నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారని, శ్రీకృష్ణసత్య సినిమా సందర్భంగా ఎన్టీఆర్ ను కూడా బాగా ఇబ్బంది పెట్టారని తెలిపారు.

అసలే ముద్దగా ఉండే సత్యనారాయణ గొంతు, ఇప్పుడు బాగా ముద్దగా అయిపోయింది(మందు ఎక్కువ అవటంవలన కావచ్చు). దానితో ఈ ఇంటర్వ్యూలో ఆయన మాటలు ఒకపట్టాన అర్ధం కావడంలేదు. అయితే ఒక సందర్భంలో హేట్సాఫ్ అనిపించారు. మీ చలనచిత్రజీవితంలో ఇష్టమైన డైలగ్ చెప్పండంటూ రాధాకృష్ణ కోరినపుడు, ఏదో పౌరాణికసినిమాలో - తాను పోషించిన దుర్యోధనపాత్ర తాలూకు డైలాగ్ చెప్పారు. సంస్కృత సమాసాలతోకూడిన సంక్లిష్టమైన, సుమారు రెండుపేజీల సుదీర్ఘ డైలాగ్ అది. అంతపొడుగు దానిని, ఇన్నేళ్ళ తర్వాత కూడా, ఈ వయసులో ఆయన గుర్తుపెట్టుకుని, చక్కగా, ముఖకవళికలతోసహా చెప్పిన తీరు అద్భుతం, అపూర్వం. అంత ప్రతిభ ఉండబట్టే అన్నాళ్ళు ఆ ఫీల్డ్ లో నిలబడగలిగారనిపించింది. మొత్తం 780 సినిమాలలో నటించానని చెప్పారు. మొత్తం కెరీర్ లో, ‘శారద’ సినిమాలోని తన పాత్ర ఎంతో ఇష్టమని తెలిపారు. రామారావుగారితో పోరాటదృశ్యాలలో నటించేటపుడు చచ్చే చావయ్యేదని చెప్పారు. ఆయన పాత్రలో లీనమైపోయి విలన్ లను బాదేవారని తెలిపారు. రేప్ దృశ్యాలలో నటించేటపుడు హీరోయిన్లతో పెద్ద ఇబ్బందులేమీ ఎదురవలేదని చెప్పారు. కేఆర్ విజయ మాత్రం బాగా కోఆపరేట్ చేసేదని, ఎలాగయినా చేసుకోండి - ఫరవాలేదని చెప్పేదని తెలిపారు.

అవార్డులు రాకపోవడానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదని, తెలుగుదేశం ఎంపీగా కొంతకాలం పనిచేయడం ఒక కారణమై ఉండొచ్చని కైకాల అన్నారు. అయినా, సావిత్రికి, ఎస్వీరంగారావుకు కూడా అవార్డులు రాలేదుకాబట్టి తాను వాళ్ళ సరసన చేరినట్లేనని చమత్కరించారు. బ్రహ్మానందం, మోహన్ బాబు(వీరిద్దరూ పద్మశ్రీ అవార్డులు పొందారు)కంటే తీసిపోయానా అని ప్రశ్నించారు. తన కొడుకులెవరూ నటులుగా రాలేదని, మనవళ్ళయినా వారసులుగా రావాలని తన అభిలాష అని మనసులోమాటను బయటపెట్టారు.

80వ దశకంముందుదాకా ఎన్నో మంచిపాత్రలు వేసిన కైకాలను ఒకరకంగా పరుచూరి బ్రదర్స్ పాడుచేశారేమోననిపిస్తుంది...అగ్నిపర్వతం, ముందడుగు వంటి సినిమాలలో చవకబారు హాస్యపాత్రలు ఇచ్చి. ముఖ్యంగా అగ్నిపర్వతంలో సత్యనారాయణ క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంటుంది. ఆయన స్థాయి నటుడు చేయదగ్గపాత్ర కానేకాదు. ఏది ఏమైనా ఆయనది ఒక పరిపూర్ణ(accomplished) జీవితమని చెప్పుకోవాలి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూకూడా జీవితంలో మంచి ఎత్తులకు ఎదిగి తెలుగువారిగుండెలలో ఒక సుస్థిరస్థానాన్ని సంపాదించుకోవడం ఆషామాషీయేంకాదు. ప్రస్తుతం మనవళ్ళతో కాలక్షేపం చేస్తున్న కైకాల, అరుంధతి వంటి ఒకటో, రెండో సినిమాలలో అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తున్నారు.

Sunday 10 April 2011

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలు



గత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు.

ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి మరీ ఒకరినొకరు అభినందించుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే అరుదయిన సందర్భమనుకుంటే మళ్ళీ వారంరోజులలోనే అలాంటి పరిణామమే చోటుచేసుకోవడం అపూర్వమే.

అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోక్ పాల్ వ్యవస్థకోసం అన్నాహజారే జరిపిన ఆమరణ నిరాహారదీక్ష కూడా జాతిలో ఓ అపూర్వ కదలిక తీసుకువచ్చింది. మొదట ఓ మోస్తరుగా ఉన్న మద్దతు గంటగంటకూ పెరిగిపోతూ నిరాహారదీక్ష చేసిన 96గంటలలో పతాకస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో అన్నాహజారేకు మద్దతుగా జనం ప్రదర్శనలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ మద్దతు పెరుగుతుండటం గమనించిన వివిధపార్టీల రాజకీయనాయకులు...తాముకూడా అవినీతికి వ్యతిరేకమేనంటూ అన్నాహజారేకు మద్దతుపలకడం ప్రారంభించారు. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చి లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించింది. బంద్ లు, ఆందోళనలు, హర్తాళ్ లు ఏమీ జరపకుండా పూర్తిగా గాంధేయమార్గంలో సాగిన అన్నాహజారే ఉద్యమం విజయవంతమవడం ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికి, రాజకీయపార్టీలకు గుణపాఠంగా నిలిచింది. ఈ ఉద్యమంవలన తక్షణమే ఏదో జరుగుతుందని ఆశించలేకపోయినా దేశప్రజలలో అనూహ్య చైతన్యం తీసుకురావడం గొప్ప శుభపరిణామమని చెప్పుకోవచ్చు.

భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ రెండు అరుదైన సందర్భాలకు మనం ప్రత్యక్షసాక్షులు కావడం మన అదృష్టమని భావించొచ్చేమో. ఇదే స్ఫూర్తి, స్పందన, చైతన్యం, ఐకమత్యం, సంఘీభావం కొనసాగితే భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతూ అగ్రరాజ్యంగా నిలబడటానికి ఎంతో కాలం పట్టదు.